
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆగ్రహం
అనంతపురం / రాప్తాడు (అక్టోబర్ 31):
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నిస్సహాయ బాలిక గోపిక లక్ష్మిపై ఒక ఉన్మాది మృగంలా దాడి చేసి, నడిరోడ్డుపై గొంతు కోసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పైశాచిక కాండను తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఆయన నిందితులకు, వ్యవస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు:
ఉరిశిక్షే ఏకైక పరిష్కారం: ఇలాంటి కౄర మృగాలకు సాధారణ జైలు శిక్షలు, బెయిళ్ళు సరిపోవు. పట్టపగలు విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాదిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించి తక్షణమే ఉరికంభం ఎక్కించాలి. నడిరోడ్డుపై ఉరితీసినా ఇలాంటి ఉన్మాదులకు తప్పులేదు. భవిష్యత్తులో ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసినా వెన్నులో వణుకు పుట్టేలా శిక్ష ఉండాలి.
బాధిత కుటుంబానికి న్యాయం: కంటికి రెప్పలా పెంచుకున్న కూతురిని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా అండగా నిలవాలి.
కాలయాపన లేకుండా ఎన్కౌంటర్ లాంటి కఠిన నిర్ణయాలు: మహిళలు, మైనర్ బాలికల జోలికి వస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చేతల్లో చూపించాలి. ఇలాంటి కేసుల్లో నెలల తరబడి విచారణలు కాకుండా సత్వర న్యాయం జరగాలి; అవసరమైతే ఆత్మరక్షణ లేదా అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా ఉన్మాదుల ఆటకట్టించాలి.
పోలీస్ నిఘా, కఠిన చట్టాలు: పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో రోమియోలు, వేధింపులకు పాల్పడేవారిపై పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా ఉంచాలి. పోకిరీలపై ఉపేక్ష లేకుండా రౌడీషీట్లు తెరిచి జైళ్లకు పంపాలి. మైనర్ల రక్షణ కోసం రాజీలేని ప్రత్యేక నూతన చట్టాలను ప్రభుత్వం తక్షణమే అమలులోకి తేవాలి.
“ఆడపిల్లలపై చేయి వేస్తే బతికి బట్టకట్టలేమనే భయం ఉన్మాదుల్లో పుట్టినప్పుడే సమాజంలో ఆడబిడ్డలకు నిజమైన రక్షణ లభిస్తుంది. గోపిక లక్ష్మికి న్యాయం జరిగే వరకు, దోషికి అత్యంత కఠినమైన ఉరిశిక్ష పడే వరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పోరాడుతుంది” అని డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి స్పష్టం చేశారు.







