చీకటి గోపి లాకప్‌డెత్ కారకులను తక్షణమే అరెస్టు చేయాలి: ఎస్పీ వకుల్ జిందాల్‌కు దళిత నేతల అల్టిమేటం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పోలీసుల వైఫల్యం వాస్తవమేనని అంగీకరించిన జిల్లా ఎస్పీ

సిఐ ఉమేష్, సిబ్బందిపై BNS 103, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్

చీకటి గోపి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి: దళిత సంఘాల నేతలు

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న దళిత ఆటో డ్రైవర్ చీకటి గోపి లాకప్‌డెత్ ఘటనపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. ఈ అమానుష ఘటనకు కారకులైన తాడికొండ సిఐ ఉమేష్, ఎస్సై జ్యోతి, కానిస్టేబుల్ మురళిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను దళిత నేతల ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చీకటి గోపి విషయంలో పోలీసుల వైఫల్యం వాస్తవమేనని అంగీకరిస్తూ, ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

బూటు కాళ్లతో తన్ని.. చిత్రహింసలు పెట్టి..

పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు, ఆటో డ్రైవర్ చీకటి గోపి మరణానికి దారితీసిన పరిస్థితులను దళిత నేతలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. చింతజల్లు గోపి అనే మరో యువకుడు ఓ తెలుగుదేశం నేత ఉంగరాన్ని కుదవబెట్టిన వ్యవహారంలో సంబంధం లేకపోయినా చీకటి గోపిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. తాడికొండ సిఐ ఉమేష్, ఎస్సై జ్యోతిలతో పాటు తెనాలిలో గతంలో ముగ్గురు దళిత యువకులపై లాఠీఛార్జ్ చేసిన చరిత్ర కలిగిన కానిస్టేబుల్ మురళి స్టేషన్‌లో హంటర్‌‌తో కొట్టి, నేలపై కూర్చోబెట్టి బూటు కాళ్లతో మర్మాంగాలపై విచక్షణారహితంగా తన్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ చిత్రహింసల కారణంగా తీవ్ర జ్వరం, అంతర్గత గాయాలతో గత నెల 1వ తేదీన గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చీకటి గోపి మృతి చెందాడు.

సాక్ష్యాల తారుమారు.. రీ-పోస్టుమార్టంకు డిమాండ్

ఈ అకృత్యాల గురించి బయటకు చెబితే గంజాయి, దొంగ బంగారం కేసులు బనాయిస్తామని బెదిరించడంతో ప్రాణభయంతో పరారైన ప్రత్యక్ష సాక్షి చింతజల్లు గోపి ఇటీవల వెలుగులోకి వచ్చి పోలీసుల దురాగతాలను వెల్లడించాడు.

సెక్షన్ల మార్పు: ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఆధారంగా నిందితులైన తాడికొండ సిఐ ఉమేష్, సిబ్బందిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 103 (హత్య నేరం)తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని నేతలు పట్టుబట్టారు.

రీ-పోస్టుమార్టం: తాడికొండ పోలీసు అధికారులు పోస్టుమార్టం నివేదికను కూడా మేనేజ్ చేశారన్న బలమైన అనుమానాలు ఉన్నాయని, వెంటనే చీకటి గోపి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు.

చట్టం అందరికీ ఒక్కటే కావాలి: నేతల హెచ్చరిక

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ గాదే సాయికృష్ణ వ్యవహారంలో మృతదేహం లభించకపోయినా అక్కడి సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లను అరెస్టు చేశారని, అలాగే క్రాంతి మాదిగ కేసులో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో సెక్షన్లు మార్చారని నేతలు గుర్తుచేశారు. అదే న్యాయాన్ని ఇక్కడ అమలు చేసి లాకప్‌డెత్‌‌కు పాల్పడిన ఖాకీలను జైలుకు పంపాలని నిలదీశారు.

దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ, ఇద్దరు సీఐలతో సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, సిట్ నివేదిక అందిన వెంటనే సంబంధిత అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎస్పీని కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగ, కొరివి వినయ్ కుమార్, నీలం నాగేంద్రరావు, నీలాంబరం, శిఖ సురేష్, బత్తుల వీరాస్వామి, దారా అంజయ్య తదితర ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని వారు తేల్చిచెప్పారు.

The Bharat Vani
Author: The Bharat Vani

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail